ఎండ్లూరి మానస కథలు చదువుతూ ఉంటే కుల వివక్ష సమకాలీన అవతారం అవగతమవుతుంది. మనుషుల ప్రవర్తన మీద హిందూ సంస్కృతి భావజాలాల పట్టు ఎంత బలంగా ఉందో కనిపిస్తుంది. టెక్నాలజీని తలదన్నుతున్న కులాలజీ అనుభవంలోకొస్తుంది. మన ఆర్థిక హోదాలతో నిమిత్తం లేని సాంఘీక హోదా మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దళిత క్రైస్తవ స్త్రీవాదం నుంచి జనరల్ స్త్రీవాదం వరకు పరచుకున్న బతుకు చిత్రాలు సెన్సిబుల్ చదువరుల్ని ఒకరకమయిన మానసిక పో...